నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ

  • సోనార్‌పూర్‌లో ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికుల దాడి
  • హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకున్న అభిషేక్
  • ఇది బీజేపీ ప్రాయోజిత హత్యాయత్నమని అభిషేక్ ఆరోపణ
  • ఆసుపత్రిపై బీజేపీ ఒత్తిడి తెచ్చిందన్న మమతా బెనర్జీ
  • అభివృద్ధి లేకపోవడంతోనే తిరగబడ్డామంటున్న స్థానికులు
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసలో బాధిత సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై స్థానికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఇది బీజేపీ పన్నిన పక్కా ప్రణాళిక అని టీఎంసీ ఆరోపించింది. టీఎంసీ పాలనపై ప్రజాగ్రహమే కారణమని బీజేపీ అంటోంది.

అసలేం జరిగింది?
సోనార్‌పూర్‌లోని కమ్రాబాద్ ప్రాంతానికి అభిషేక్ బెనర్జీ మోటార్ సైకిల్‌పై వస్తున్న సమాచారం అందుకున్న వందలాది మంది స్థానికులు గుంపుగా చేరారు. ఆయన రాగానే చుట్టుముట్టి 'చోర్ చోర్' (దొంగ) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు సైతం చీపుర్లు, వెదురు కర్రలతో నిరసనకు దిగారు. కొంతమంది ఆందోళనకారులు అభిషేక్‌పై రాళ్లు, గుడ్లు, చెప్పులు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తోపులాటలో ఆయన చొక్కా చిరిగిపోగా, కళ్లద్దాలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు హెల్మెట్ ఇచ్చి.. మానవహారంగా ఏర్పడి అతికష్టం మీద అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాడిలో గాయపడిన అభిషేక్‌ను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ థెరపీ యూనిట్ (ఐటీయూ)లో చేర్పించి చికిత్స అందించారు.

బీజేపీ కుట్రే: అభిషేక్, మమత
దాడి అనంతరం అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. "ఇది బీజేపీ స్పాన్సర్ చేసిన హత్యాయత్నం. నన్ను చంపడానికే ఈ దాడి చేశారు. హెల్మెట్ ఉండటం వల్లే నా ప్రాణాలు నిలిచాయి. మా పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా భద్రత కల్పించలేదు" అని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ పరిస్థితి విషమంగా ఉన్నా, అపోలో ఆసుపత్రి యాజమాన్యంపై, స్థానిక పోలీసులపై బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చి బలవంతంగా డిశ్చార్జ్ చేయించారని ఆరోపించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను బెల్లెవ్యూ ఆసుపత్రికి, ఆ తర్వాత ఇంటికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఆక్సిజన్ సపోర్ట్‌తో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని వివరించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు ఫోన్ చేసి పరామర్శించారని, ఈ ‘ప్రజాస్వామ్య హత్య’కు నిరసనగా ధర్నా చేపడతామని ఆమె ప్రకటించారు.

ప్రజాగ్రహమే కారణం: స్థానికులు, బీజేపీ
అయితే, స్థానికులు తమ ఆగ్రహానికి వేరే కారణాలు చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా తమ ప్రాంతంలో తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు లేవని, అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అభిషేక్ బెనర్జీ చేసిన బెదిరింపు వ్యాఖ్యలకు నిరసనగానే తాము తిరగబడ్డామని పలువురు మహిళలు తెలిపారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ దాడిని ఖండించారు. ఇందులో తమ పార్టీ ప్రమేయం లేదని, టీఎంసీ ప్రభుత్వ అరాచకాలపై ఏళ్లుగా ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహమే ఈ రూపంలో బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు.

Abhishek Banerjee
TMC
BJP
West Bengal
Mamata Banerjee
attack
Sonarpur
political violence
Trinamool Congress
Samik Bhattacharya

More Telugu News